Sunday 12 August 2018

సంవాదలేఖ-4 - శివః శక్త్యా యుక్తః

శివుడు-  ఏంటి? ఈరోజు అంత ముభావంగా ఉన్నావు?
పార్వతి- మీకెందుకు నేనెట్లా ఉంటే?
శివుడు- అయ్యో, చెప్పు, ఏమైనా తీర్చేదుంటే తీరుస్తాను.
పార్వతి- ఆఁ, వివాహం అయిన దగ్గరినుంచీ చెప్పుకుంటునే ఉన్నాను.. అప్పుడు తీర్చారు గనుక..!
శివుడు- (నవ్వి) ఏ విషయమో సరిగ్గా చెప్పు.. మూడు కళ్ళు ఉన్నా నీ మనసు నాకు గోచరం కావటం లేదు.
పార్వతి- అదేం కాదు.. నా నోట చెప్పించాలని! మీ నింద చేయటం నాకు పాపం. పోండి, నేనేం చెప్పను.
శివుడు- ఏది, నా రూపం, క్రియల గురించేనా? ఆ మధ్య నీ మిత్రురాలు మహాలక్ష్మి ఏదో అన్నదని కుంగుకున్నావు-  అదేనా?
పార్వతి-  అదే అదే! తనకు తగినట్టు నేను ఆవేళే సమాధానం చెప్పేశాను. (కోపంగా) కానీ అన్నదానిలో తప్పేముంది?
శివుడు- అందరూ అన్నది వింటావు.. నేనెవరో నీకు తెలియదా?
పార్వతి- తెలుసు కనుకే అడుగుతున్నాను. అసలేంటి? ఎట్లా బ్రతకాలి మీ పంచన? ఆ ఒళ్ళంతా బూడిద, తోలు బట్టలు, వెంట ముసలి ఎద్దు, ఈ శ్మశానంలో ఉండటం, చేతిలో భిక్షాపాత్ర, దానితో భిక్షమెత్తి బ్రతకటం, పాములు చుట్టుకుని తిరగటం, నెత్తిన ఇంతెత్తు కొప్పులు, ఎన్నడూ కనీసం దువ్వరు, వాటిలో పగలూ రాత్రీ జలాల హోరు.. ఒకటా రెండా..? ఎన్నని చెప్పను? చెప్పినా మీరు మారతారా?
శివుడు- (గట్టిగా నవ్వి) అయ్యో, పిచ్చి గౌరీ, నేను ఎంత సుందరుణ్ణో నీకు తెలుసు కదా. నన్ను పెళ్ళికి ముందు చూసి, కోరి, మోహించి, పరితపించి, కఠిన తపస్సు చేత కొనేసుకుని పొందింది నువ్వే కదా..! అప్పుడు లేని ఈ బాధ ఇప్పుడెందుకు?
పార్వతి- (తలవంచుకుని) అట్లా కాదండీ.. తన భర్త అందంగా ఉంటే చూడాలని భార్యకు అప్పుడప్పుడైనా అనిపించదా? అటు దేవతలూ, ఇటు మనుష్యులు నా పక్కన మిమ్మల్ని చూసి ‘ఇంత అందమైన అమ్మాయికి ఎట్లాంటివాడు దొరికాడు? ఇతడి కోసమా, ఈమె అంత తపస్సు చేసింది? ఏం చూసి ఇచ్చారు ఈమె తల్లిదండ్రులు ఆయనకు?’ అని అనుకుంటున్నారు.
శివుడు- ఔనా? నేనెప్పుడూ వినలేదే.. నా ముందు ఎవ్వరూ అనలేదే!
పార్వతి- అంత ధైర్యమా వాళ్ళకు? మీతో పని ఉన్నవారు మీగురించి మీముందే మాట్లాడేయరు కదా. ఒకవేళ వారు అన్నా మీకు ఆ ధ్యానలయలో పట్టించుకునే తీరిక ఏది?
శివుడు-  (నిట్టూర్చి, ఆమె తల ఎత్తి) సరే-  అయితే చూడు.. (తన అసలు రూపంలోకి మార్చుకుని) ఇప్పుడేమంటావు?
పార్వతి- (నమ్మలేనట్టు కళ్ళనిండా పైనుండి కిందిదాకా చూసుకుని ఏదో అనబోయి ఇంతలోకే మూతి ముడుస్తుంది.)
శివుడు- ఏమైంది? కళ్ళలో ఒక్క వెలుగు కనిపించి మళ్ళీ ఇంతలోనే కారుమబ్బు కమ్మింది?
పార్వతి- మీతో నేనేం మాట్లాడను పోండి.
శివుడు- అయ్యో, ఎందుకు? ఇప్పుడేం పాపం చేశాను? ఈ అందం సరిపోలేదా? ఈ సహస్రకోటి కందర్పకాంతి, దివ్యాభరణాలు, దివ్యమాల్యాలు, సుగంధ లేపనాలు, మహార్హమైన వస్త్రాలు, ఈ హిమాలయాలనే శోభింపచేసే సౌందర్యం-  ఇవన్నీ కూడా చాలలేదా?
పార్వతి- (కొద్దిగా నవ్వుతుంది తల అడ్డంగా ఊపుతూ)
శివుడు- (ఆలోచించి నవ్వి) లేక... నీకన్నా అందంగా అయిపోయాననా? నిజం చెప్పు.
పార్వతి- (ఎటో చూస్తుంది) మీ స్వరూపమే అంత అందం కదా! దానికి మీరేం చేస్తారు? నాకు నిజంగా ఈర్ష్యగా ఉంది.
శివుడు- (నవ్వి) అర్థమైంది. అయ్యో, శివా! ఒక్కసారి ఇటు చూడు..
పార్వతి- అఁహఁ.. నేనేం వినను.. చూడను.. (వెళిపోబోతుంది)
శివుడు- (ఆమె చేతిని పట్టి ఆపి) ఆగు. ఒక్కమాట తర్కం ఆలోచించు. ఇది నా అందమా? నన్ను వ్యక్తం చేసింది ఎవరు? నువ్వు లేకపోతే నేను వ్యక్తమవుతానా? నాకు ఆ సామర్థ్యం ఉందా? నన్ను వ్యక్తం చేసే శక్తివి నీవైతే ఈ సౌందర్యం నీవే కదా.
పార్వతి- (కొంచెం సిగ్గుగా నవ్వి) నిజమేననుకోండి. కానీ ఇంత మోహనంగా మిమ్మల్ని చూసి.. చాలా ఆనందంగా ఉంటే తట్టుకోలేక కోపం నటించాను. (ముఖం అరచేతుల్లో దాచేసుకుంటుంది).
శివుడు- (నవ్వేసి ఆమె చేతులు తీసేసి) సరే.. మరి, ఇప్పుడు నీ భర్త పై ఏమైనా ఆక్షేపాలు మిగిలున్నాయా?
పార్వతి- (చిరునవ్వుతో చూస్తూ) ఇంకేం ఉంటాయి? ఇంక మీకెట్లా వీలుగా ఉంటే అట్లా ఉండండి. నాకే ఆక్షేపాలూ లేవు. మీ నిజమైన సౌందర్యం పదునాల్గు లోకాలలోని ఆక్షేపకులకు చూపాలనే ఆత్రుతలో అట్లా మాట్లాడాను. క్షమించండి.
శివుడు- మనలో మనకు క్షమలేంటి? ఫరవాలేదు. ఎటూ తయారైనాము కదా. అట్లా తిరిగి వద్దాము-  ఈ ముసలి ఎద్దు మీద.
పార్వతి- (నవ్వి) వస్తున్నా. మన నంది ఏం ముసలివాడు కాదు. ఏదో ఊరికే అన్నాను అట్లా.
శివుడు- నువ్వట్లా అన్నప్పుడు విని నంది నొచ్చుకున్నాడేమో.
పార్వతి- నేను లాలిస్తా లేండి. పదండి. మిమ్మల్ని ఇంత సుందరంగా చూసి ఎంత ఆనందిస్తాడో అతడు.
శివుడు- (నవ్వి) పిల్లలను కూడా తీసుకుపోదామా?
పార్వతి- వాళ్ళు అప్పటినుంచే సిద్ధంగా ఉన్నారు. పదండి.
[దేవతలంతా సంతోషంగా నవ్వుతూ వారిపై పుష్పవృష్టి కురిపించారు.]
(ఆ విధంగా సరససల్లాపాలు చేసుకుంటూ ఆనందించే ఆ సంతృప్త కుటుంబీకుడు మనలను సర్వదా రక్షించుగాక.)
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
 

{ఇందులో పూర్వ భాగం శివభక్తవిలాసంలో ఉంది. శివుడు తన రూపం మార్చినంతవరకు-  కానీ ఆ తరువాత పార్వతి ఈర్ష్యాది ఘట్టం నేనూహించినది. మూలంలో ఆమె ఆయన రూపంచేత పరవశయై స్తుతిస్తుంది. ఉపమన్యుమహర్షికి కృతజ్ఞతలతో.. శివార్పణం}


ఒక సవరణ. పార్వతీదేవికి ఈర్ష్య ఉంటుందా? నిజంగా భర్త సౌందర్యం చూసి ఆమె ఆనందించాలి కదా-  అని అనిపించింది. ఏమో మరి-  ఆ ఘట్టం చదివిన వేళ స్ఫురణ అకస్మాత్తుగా అట్లా వచ్చింది. ఆయన అందంగా రూపం మార్చుకున్నాక కూడా ఆమె కోపానికి కారణం ‘అంత అందం పెట్టుకుని కూడా రోజూ విరూపంగా ఉండటం ఎందుకు?’ అని మారుద్దామని కూడా ఎందుకో చేయలేకపోయాను. సరే, సరదాగా ఉంటుందని, ఈర్ష్య అయినా ఒక్క క్షణం పాటే కదా అని, అవతలివారు ఈర్ష్యపడేంత అందం ఒక గొప్పతనమే కదా అని, సరే, ఎన్ని అనుకున్నా ఇద్దరూ అభిన్నులే కదా అని, భర్త తనకన్నా అందంగా, గొప్పగా ఉంటే ఆయన పక్కనున్న ఆ భార్యకు గొప్పే కదా అని, సరిపెట్టుకున్నాను.

No comments:

Post a Comment