Sunday 12 August 2018

శివగీతం-3 - మా ఇంటికి రావయ్యా (షోడశోపచారాల చిరు గీతాష్టకం)

ఏమయ్యా, మా ఇంటికి రావు, ఎంతని పిలిచేది
అహా, ఇప్పటికొచ్చావే, నాదెంతటి సౌభాగ్యం
అయ్యో, అట్లా నిలబడ్డావేఁ, లోపల రావయ్యా
ఆసనం అది మెత్తగ లేదు, ఇక్కడ రా, కూర్చో

నీ చేతులు, పాదాలందించు, శుభ్రం చేస్తాను
ఇదిగో అందుము మంచినీరు, నీ దాహం తీరిందా?
గోరువెచ్చని నీరు పోసుకుని స్నానం కానించు
తడి ఆరేంతగ తుడిచాకే, ఈ బట్టలు ధరించు

ఇదిగో, నీరు, అందుకుని నీ గొంతు కాస్త తడుపు
నీకై తెచ్చా యజ్ఞోపవీతం, దీనిని ధరించు
చలవ చేసేటి ఈ గంధాన్ని మేనికి పూయనీ
ఏదీ, నీ నుదురిటు చూపించు, కుంకుమను దిద్దనీ

ఇదిగో పరిమళ పుష్పం, అది నీ అందం ముందెంత?
పూమాలలు నీ మెడలో వెయనీ, భూషణాలివ్వనీ
అగరొత్తులు ధూపాల సువాసన నీకు నచ్చిందా?
వెలుగులనిచ్చే నీకై దీపం వెలిగించా చూడు

ఇదిగో రుచికరమైన భోజనం, తిని ఆనందించు
చక్కని ఆకూ, ఒక్కలతో నీకిదిగో తాంబూలం
ఘంటానాదం సహితంగా నీకిదిగో హారతులు
మంత్రాన్నే ఓ పుష్పం చేసి నీకై అర్పిచా

నీ పాదాలకు అక్షతలేసి ఇదె అంగప్రణామం
కాస్తాగు, ఇక సేద తీరు, చామరం వీయనీ
నీకై చక్కని పాట పాడుతూ కీర్తించుకోనా
ఈ నృత్యంతో నీ మనసును ఆనందపరచనా

నీ తత్త్వం నే తెలియగలేను, జ్ఞానిని నే కాను
నిను భావించి, శక్తిని బట్టి నిను పూజించేను
ఎల్లప్పుడు నీ కరుణను చూపి కాపాడు ఓ స్వామీ
ఆత్మప్రదక్షిణ చేస్తూ నీకై సర్వం అర్పించా

అయ్యో అపుడే వెళిపోవాలా, మళ్ళెపుడో రాక?
నావల్లేదైనా తప్పైతే క్షమించు ఓ తండ్రీ
దాసుని తప్పులు దండంతో సరి, ఇదిగో నమస్సు
నీ రాకతో మా ఇల్లు పావనం, వెళ్ళిరా నా తండ్రీ


(సరళంగా పాడుకుంటూ భావించుకోగలిగే విధంగా ఉపచారాల పాట.. అపచారమేదైనా ఉంటే సూచించండి.. ఏమో- ఈరోజు అట్లా అనిపించింది.. రత్నైః కల్పితమాసనం- వింటుంటే.. అంత గొప్పగా సింహాసనాదులు భావించటం నాకు రాదు.. (భావదరిద్రం ఆయన కరుణతో తీర్చినప్పుడు తీరుతుంది) అప్పటిదాకా నా పరిధిలో నా ఊహలో అందినంత..)

No comments:

Post a Comment