Sunday 12 August 2018

సంవాదలేఖ-3 - నేను ఎదురుచూస్తున్నాను

నేను ఎదురుచూస్తున్నాను
సంవాదలేఖ-3
 

శివుడు- “ఏం కావాలి..?”
నేను- “ఏం వద్దు...”
శివుడు- “మరి, నా వంక అట్లా ఎందుకు చూస్తున్నావు..?”
నేను- “చూడాలనిపించింది.. చూస్తున్నా..”
శివుడు- “ఏమైనా కావాలంటే అడుగు. ఉత్తగ చూడటం ఎందుకు..?”
నేను- “అడిగింది ఎటూ ఇవ్వవు.. దాటేస్తావు.. కనీసం చూసైనా ఆనందించుకోనివ్వు..”
శివుడు- “ఏమివ్వలేదుటా..?”
నేను- “నీ నుంచి నిన్ను అడిగానుగా..! ఇచ్చావా ఇంతవరకు..?”
శివుడు- “అది కుదరదు.. చాలా కష్టం.. అందుకు ఎన్నో షరతులున్నాయి..”
నేను- “సరే, ఇవ్వకు.. నేనెప్పుడైనా మళ్ళీ అడిగానా..?”
శివుడు- “మరెందుకు చూస్తున్నావు..?”
నేను- “కనీసం కళ్ళ నిండా చూసుకోవటం కూడా తప్పేనా..!!?”
శివుడు- “చూడటానికి చాలా ఉన్నాయి..”
నేను- “నువ్వూ వాటిలో ఒకటి కదా..! నాకు నువ్వు చాలు”
శివుడు- “అదిగో, అటు చూడు.. ఎంత అందమైన ప్రకృతో..”
నేను- “చూడను..”
శివుడు- “ఇదిగో, నీకిష్టమైన పువ్వులు.. ఎంత సువాసనగా ఉన్నాయో.. వాసనైనా చూడు..!”
నేను- “అక్ఖర్లేదు..”
శివుడు- “ఏయ్.. నీకిష్టమైన ఆహారపదార్థం.. రుచైనా చూడు.. నోరు తెరువు..”
నేను- “వద్దు.. తెరవను..”
శివుడు- “సాక్షాత్తు అన్నపూర్ణే చేసింది.. నేను పెట్టినా తినవా?”
నేను- “మళ్ళీ ఆ ఆస్వాదనలో పడి నిన్ను పక్కకు పెట్టాలనా? అదేం చెల్లదు..”
శివుడు- “పోనీ, ఆ అమ్మాయి చూడు, ఎంత అందంగా నర్తిస్తున్నదో..”
నేను- “నీ తాండవం కంటేనా?
శివుడు- “నువ్వెప్పుడు చూశావది?”
నేను- “చూడలేదు, విన్నాను.. చదివాను.. చూసేంత అదృష్టమా?”
శివుడు- “పోనీ, ఇప్పటికి ఆమె నర్తనంతో తృప్తి పడు.. కనీసం చూడు.. ఓసారి”
నేను- “అంత బాగుంటే నువ్వే చూసుకో.. నాకు నువ్వు చాలు..”
శివుడు- “ఏంటీ పట్టుదల..?”
నేను- “అదంతే..”
శివుడు- “ఇంత అందమైన లోకం నీకోసమే చేసింది..”
నేను- “నేనవన్నీ చూస్తూ నిన్ను మర్చిపోవాలనే కదా నీ ఎత్తు..?! అదేం పారదు ఈసారి..”
శివుడు- “అయ్యో రామా..! ఇట్లాగే నన్ను చూస్తూ కూర్చుంటే ఏం వస్తుంది..?”
నేను- “ఏది రావాలో అదే వస్తుంది..”
శివుడు- “ఎన్నటికీ రాకపోతే..?”
నేను- “పోనీ..! ఏదో రావాలని చూడటం ఎప్పుడో మానేశాను..”
శివుడు- “నువ్వు కోరినది ఏదీ దొరకదు..”
నేను- “అందుకే ఏదీ కోరటం లేదు కదా.. ఎందుకంత కంగారు..?”
శివుడు- “ఇదిగో ఈ భక్తితో నా దుంప తెంపకు.. అడిగిందల్లా ఇవ్వటం నావల్ల కాదు..”
నేను- “ఇవ్వకయ్యా.. నీ దగ్గరే ఉంచుకో.. ఎవరడిగారు..?”
శివుడు- “ఇప్పుడు అడగవు.. తరువాత వదలవు”
నేను- “ఇప్పుడూ వదిలానని ఎవరు చెప్పారు?”
శివుడు- “అంటే? అడుగుతున్నావనేగా?”
నేను- “నేనేమీ నోరు తెరిచి అడగను.. చాలా? మాటిస్తున్నాను. కళ్ళార్పకుండా చూసుకోనివ్వు చాలు.”
శివుడు- “నువ్విట్లాగే చూస్తుంటే నువ్వడిగిందల్లా చేయాల్సి వస్తుంది..”
నేను- “అది నీ తలనెప్పి.. నాది కాదు.. మాటిచ్చింది నువ్వు.. నిలబెట్టుకోవలసిందీ నువ్వే..”
శివుడు- “సరే, పోనీ, ఆ అందమైన వీణాలాపనం అయినా విను..”
నేను- “చూడు, నీ పని నువ్వు చూసుకో. నేనేం చేయాలో నాకు వదిలేసేయి. మాచేత లోకంలో అవన్నీ చేయిస్తూ, భ్రమలో పడేస్తూ, మమ్మల్ని మరిపిస్తూ నువ్వు హాయిగా తప్పించుకుంటున్నావు.. ఇంక నీ ఆటలు సాగనివ్వను..”
శివుడు- “నావి ఆటలా?”
నేను- “మరి కాక? బొమ్మను చేసి..”
శివుడు- “ఇదిగో, బొమ్మల్లాగ మిమ్మల్ని ఆడించేది మీరు చేసుకున్న కర్మ..”
నేను- “సరే, ఏదైతే ఏఁ? నాకవన్నీ తెలియదు. నేనంత చదువుకోలేదు. ఏదేమైనా, ఇంక నేను ఆడను.. ఆడింది చాలు..”
శివుడు- “మంచి నిర్ణయం. ఇంక నాతో ఏం పని..?”
నేను- “ఆటైపోయాక చేరేది ఇంటికే కదా.. తలుపు తీస్తావని..”
శివుడు- “అదిగో, ఏమీ కోరనన్నావుగా..”
నేను- “నిన్ను తియ్యమనలేదే..! తీస్తావని నేను ఎదురుచూస్తున్నాను అన్నాను..”
శివుడు- “.....”
నేను- “అందరూ ఇదే అంటారు.. తరువాత నన్ను పీడిస్తారు.. అదివ్వు, ఇదివ్వు అని.. నేనివ్వలేను..”
శివుడు- ఆ మార్కండెయునికోసం యముడిని సైతం ఏ తప్పు లేకుండానే మట్టు పెట్టాను.. నాకు అవన్ని తిరిగి చేయాలని లేదు..
నేను- చేయకు..
------------

No comments:

Post a Comment