Sunday 12 August 2018

శివగీతం-2 - నదిలో లింగాల దృశ్యంతో కదిలిన మది

కలిలో వేడికి తాళగలేక
జలమున దాగేవా..
శిలపై శిలవై బహుళంగా అయి
ఇలపై నిలిచేవా..॥


అణువణువున దాగున్నది నీవని
ఈ విధి తెలిపేవా
వెలుపల లోపల అంతట నీవని
స్పృహ కలిగించేవా..॥


జలముల జలజల సామవేదమని
ఇట భావించేవా
ఆ సంగీతపు మంద్రస్థాయిన
వెలుపలకొచ్చేవా..॥
ప్రతి శిలపై నీ రూపం చూసి
కనులకు పండగలే
పాషాణాలే పాడిన రుద్రం
వీనుల విందేలే..॥


నదీధరునివే, నదిలో దాగిన
నీ పేరిపుడేమి..
నదీనివాసా, జలసహవాసా
ఏమని పిలిచేది..॥


నీటి దుప్పటిని కప్పుకుంటివా
ఇప్పుడు అది తొలగె..
కదిలే నీటిన కదలనిదది
స్థాణువుగా నీ వెలుగే..॥


పంటపొలాలకు నీరు పోసితే
పంటలు పండేను..
బండరాళ్ళపై నీరు పారగా
లింగాలు పండేను..॥
 

(శాల్మల నదిలో నీటిమట్టం తగ్గేసరికి లోపలున్న శివలింగాలు బయట పడినాయట.. ఆ వివరం ఇక్కడుంది--
https://www.sott.net/article/301190-Low-water-level-exposes-thousands-of-Shiva-Lingas-in-the-Shalmala-river)

No comments:

Post a Comment