Sunday 12 August 2018

సంవాదలేఖ-2 - నిన్ను విడిసి ఉండలేనయా

నిన్ను విడిసి ఉండలేనయా
సంవాదలేఖ-2
 

నేను- “హరిఓం..”
శివుడు- “చెప్పు..”
నేను- “బాగున్నావా?”
శివుడు- “కనిపిస్తున్నా కదా”
నేను- “ఏం చేస్తున్నారు?”
శివుడు- “ఏముంటాయి? లోకనిర్మాణం, రక్షణం, సంహారం నాకు..; మీ అమ్మకేమో, భోజనం వేళ కదా.. వండి వడ్డించి ఆకళ్ళు తీర్చటంలో నిమగ్నత..”
నేను- “మరి పెద్దవాడు, చిన్ని కుమారుడు?”
శివుడు- “గజముఖంతో షణ్ముఖుడికి ఆటలు.. ఆరు ముఖాలతో గజాననుడికి ఆటలు..! పిండితో తయారైన పసివాడని చిన్నవాడు అల్లరి పెడతుంటాడు.. ఆరుగురు తల్లుల గారం ఇతగాడిని చెడగొట్టిందని పెద్దవాడంటాడు.. వాళ్ళ ఆటలు వాళ్ళవి.. నీకేం కావాలి?”
నేను- “ఏం వద్దు.. ఊరికే పలకరిద్దామని..”
శివుడు- “నిన్ను బయటే ఉంచానేమని మీ అమ్మ అడిగింది.. రమ్మంటోంది లోపలకు..”
నేను- “నువ్వు పిలిస్తే కానీ రానని చెప్పలేదా?”
శివుడు- “అదే చెప్పాను..”
నేను- “ఎందుకు పిలవటం లేదని అడిగిందా?”
శివుడు- “షరతులు అమలు అవుతాయని చెప్పాను..”
నేను- “ఔను.. అమ్మ కనుక బాధ అర్థం చేసుకుని రమ్మంటుంది.. షరతులు, నియమాలని ప్రాణాలు తోడదు.. తలుపు దగ్గర చూసి మొట్టమొదలు దగ్గర తీసుకుని, నదుట ముద్దు పెట్టి, కడుపు నిండా అన్నం పెట్టి, అప్పుడు బాధేంటని అడుగుతుంది.. చెప్పగానే తీరుస్తుంది..”
శివుడు- (సరదాగా) “ఆఁ..! ఆఁ..! ఏదైనా తేడా ఉందని తెలిస్తే రెండు అంటించేది కూడా అమ్మే..”
నేను- (నవ్వి) “ఔనౌను.. ఆ విషయంలో నాన్నలు నయం..! కోప్పడతారు, కానీ చేయెత్తరు.. ఆ స్వతంత్రం అమ్మకే..! కొడితే అమ్మ కొట్టాలి.. తిడితే అమ్మ తిట్టాలి.. నాన్నను మాట అననివ్వదు..! అందుకే తెలివిగా నీ దగ్గరకు వచ్చాను.. ”
శివుడు- “కబుర్లు బానే చెప్తున్నావు.. ఏం కావాలి?”
నేను- “ఎప్పుడైనా, ఎక్కడైనా నాకొకటే కావాలి..”
శివుడు- “కుదరదు..”
నేను- “వేయి సార్లు అదే చెప్పావు.. మళ్ళీ ఎందుకు అడుగుతావు..? నా బాధ నన్ను పడనివ్వరాదా?”
శివుడు- “ఇంకో కోటిసార్లైనా అదే చెప్తాను..! అయినా నీవు బాధపడుతుంటే చూడలేను..”
నేను- “అయితే తీర్చు..”
శివుడు- “షరతులు? నియమాలు? పద్ధతులు?”
నేను- “సరేలేవయ్యా.. వెళ్ళు.. పని చూసుకో.. లోకమంతా నీకోసం ఎదురు చూస్తున్నది.. నా పని నన్ను చేసుకోనివ్వు..”
శివుడు- “మరి పనివేళా పలకరించటం ఎందుకు?”
నేను- “లోపలకు పిలవటానికి కదా నియమాలు..?! పలకరించటానికి ఆటంకాలు లేవు కదా? ఏఁ.. అదీ తప్పేనా?”
శివుడు- “ఊఁ.. సరీపోయింది..”
నేను- “ఎక్కడా? నీవు కనికరించనిదే?”
శివుడు- “ఇవ్వను.. నీ మేలు కోరేవాణ్ణి కనకే..! అడిగిందల్లా ఇస్తుంటే పెద్దల విలువేం ఉంది?”
నేను- “సరే, నీ నిబంధనలు, పాఠాలు అయ్యాకే, నీ మార్గంలోనే వస్తాలే..”
శివుడు- “నీ ఇష్టం..”
నేను- “అది నా ఇష్టం కాదు.. నీ ఇష్టం..”
శివుడు- “రెండూ ఒకటే కాదా?”
నేను- “ఆ మాట నీవంటున్నావా?”
శివుడు- “నిజం అదే కదా! నేను నిజమే చెప్తా..”
నేను- (నవ్వు) “అందుకే నిన్ను విడిసి ఉండలేనయా.. నమో నమః..”

No comments:

Post a Comment