Sunday 12 August 2018

సంవాదలేఖ-1 - నువ్వే కావాలి

నువ్వే కావాలి
సంవాదలేఖ-1
 

శివుడు- “తీసుకో”
నేను- “వద్దు”
శివుడు- “ఇది వద్దా..?”
నేను- “ఏదీ వద్దు”
శివుడు- “మరి ఏం కావాలి?”
నేను- “చెప్పా కదా- ఏదీ అంటే ఏదీ వద్దని..”
శివుడు- “మరెందుకు పిలిచావు?”
నేను- “ఏదడిగినా ఇస్తావని పిలిచాను..”
శివుడు- “మరి ఇస్తానంటుంటే తీసుకోవేఁ?”
నేను- “ఇది కాదు నేను అడిగింది.. ఇది వద్దు..”
శివుడు- “మరి ఏం కావాలి?”
నేను- “ప్రశ్న తప్పు”
శివుడు- “సరే, సరైన ప్రశ్న నువ్వే చెప్పు..”
నేను- “ఎవరు కావాలి?”
శివుడు- “---” (చిరునవ్వులు)
నేను- “మరి కావాల్సింది.. ఇస్తావా..?”
శివుడు- “కుదరదు..”
నేను- “ఏదంటే అది ఇస్తానన్నావుగా..”
శివుడు- “ఎవరంటే వారిని అనలేదు కదా.. అడిగిన వస్తువు అన్నాను..”
నేను- “అడిగిన వస్తువు అంటే.. కావాలి అనే క్రియకు కర్మ.. అంతే కదా?”
శివుడు- “ఔను..”
నేను- “నా కావాలి క్రియకు కర్మకు నువ్వే..”
శివుడు- “ఇంకేదైనా అడగరాదా?”
నేను- “ఇంకేది అడిగినా ఇస్తావు.. అందుకే అడగటం లేదు..”
శివుడు- “కావాల్సింది దొరకటమే కదా, కావాలి కోరికకు అంతరార్థం..? ఇవ్వకపోవటానికి కాదు కదా ఇస్తానన్నది?”
నేను- “అందుకే.. ఇంక అదీ ఇదీ అడిగేకంటే అన్ని ఇచ్చే వాడివి నిన్నే పొందేస్తే ఓ పనైపోతుంది కదా అని..”
శివుడు- “తరువాత నా పనై పోతుంది..”
నేను- “అందుకే అడుగుతున్నా.. ఇంక నా పిచ్చి కోరికలన్నీ తీర్చే పని తప్పుతుంది కదా అని..! వేరొకరి సంగతి చూసుకోవచ్చు ఇక..”
శివుడు- “నీ సంగతి చూస్తూ వేరొకరి సంగతిచూడలేను అని ఎవరు చెప్పారు?”
నేను- “అబ్బా, వాదనలాపు.. ఇచ్చుకుంటావా ఇచ్చుకోవా చెప్పు..”
శివుడు- “నీవు ఆ స్థాయిలో లేవు..”
నేను- “నాకదంతా తెలియదు.. అడిగింది ఇస్తానని మాటిచ్చావు.. నిన్ను నువ్వు ఇవ్వు ఇక.. అంతే!! నేనింకో అక్షరం కూడా తక్కువ తీసుకోను.”
శివుడు- “సరే, ఎందుకు కావాలి నేను? ఏం చేసుకుంటావు?”
నేను- “అడిగినదానికి ఇంతవరకూ ఎవ్వరూ ఎందుకు అని అడగలేదు.. అయినా చెప్పాను కదా.. ఓ పనైపోతుంది అని.”
శివుడు- “ఇవ్వకపోతే ఏం చేస్తావు..?”
నేను- “మాట తప్పావని అందరితో చెప్తాను. .అప్పుడు నిన్నెవ్వరూ నమ్మరు..”
శివుడు- “అబ్బబ్బా.. బాగా అల్లరి నేర్చావు..”
నేను- “బూడిద పూసుకుని, పాములేసుకుని, మూడేసి కళ్ళతో, రక్తం ఓడే చర్మం కట్టుకుని, శ్మశానంలో ఒంటరిగా తిరిగే నీకంటేనా?”
శివుడు- “----” (చిరున్వవులు)
నేను- “తర్వాత నవ్వుదువులే.. మొదలు చెప్పు.. సమాధానం..”
శివుడు- “ఎవరు నేర్పారు నీకిది?”
నేను- “నాకన్నా ముందు నీ జాడ పట్టినవారే..”
శివుడు- “సరే, కానివ్వు..”
------------

No comments:

Post a Comment