Sunday 12 August 2018

భావలేఖ-1 - నేను పనికొస్తే వాడుకోవయ్యా..!

ఏమయ్యా ఉన్నావా, వింటున్నావా? ఓ మాట..! నీకు కూతుర్లు లేరు కదా. ఇద్దరూ కొడుకులే.. పాపం, ఇంటి పనికోసం ఇంట్లోవారిలా ఎవరుంటారు? గణాలుంటారులే.. కానీ ఎంతైనా ఇంట్లోవారిలా చేయరు కదా..! నన్ను నీ దగ్గర పెట్టుకోవచ్చు కదా! మీ ఇంట్లో అమ్మాయిలా పనులు చేసి పెడతాను. నీ ఎద్దును కడిగి పెడతాను.. నీ పాముల్ని రోజూ చక్కగా తుడిచి పెడతాను.. వాటికి ఆహారం పెడతాను.. నీ పిల్లలిద్దరినీ కూడా బాగా చూసుకుంటాను. పెద్దవాడి ఎలకను, చిన్నవాడి నెమలిని కూడా చక్కగా చూసుకుంటాను. వాళ్ళకు కావాల్సిన ఆహారం పెడతాను.
    ఇంక మీ ఆవిడకి ఇంట్లో వంటలో సహాయం చేస్తాను. ఆమె అన్నపూర్ణ కదా. అందరికీ వంట చేసిపెట్టడానికి చాలా పని ఉంటుంది.. ఒక్కర్తీ చేసుకోవాలి. అసలే నీకు ఐదు ముఖాలు, పెద్దవాడిది ఏనుగు ముఖం.. చిన్నవాడికి ఏకంగా ఆరారు ముఖాలు! పాపం.. అన్నిటికీ చూసి చూసి అన్నం తినిపించాలి కదా..! చాలా పని ఉంటుంది. చేతికంద ఉంటాను..
    ఇంకా నీ త్రిశూలం, పినాకం, నీ ఆయుధాలన్నీ, వాటితోపాటు మీ ఆవిడ ఎనిమిది చేతుల్లో ఉన్న అన్ని ఆయుధాలు, మీ పిల్లల ఆయుధాలు కూడా రోజూ తుడిచి పెడతాను. మీరేసుకునే ఆభరణాలు చక్కగా సాఫు చేసి ఇస్తాను. మీ పిల్లల పీతాంబరాలు, నీవు ధరించే జింక చర్మం, గజచర్మం ఉతికి పెడతాను. ఇంకా మీ ఆవిడ పట్టు చీరలు పాపం తనే పిండుకోవాలి కదా.. నేను పిండి పెడతాను. సరేనా?
    నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడు. తప్పక నేను మీ ఇంట్లో అందరికీ నచ్చుతాను. నీకు లోకరక్షణ, లోకపాలనా- బోలెడు పనులు ఉంటాయి. కనీసం జుట్టైనా దువ్వుకునే వేళ చిక్కదాయె. పనులు చేసి చేసి అలసటై, నీకు కాళ్ల నొప్పులు పుడితే ఎవరొత్తుతారు? పాపం – అమ్మవారు కూడా తన పనులతో అలసిపోతుంది కదా. ఇద్దరికీ పాదాలు ఒత్తుతాను. కనీసం ఎందులో అయినా నేను పనికొస్తే వాడుకోవయ్యా..!

No comments:

Post a Comment