Monday 5 November 2018

సంవాదలేఖ-7 అండగా నువ్వుంటే మాకు సమస్య ఏమిటి?

అండగా నువ్వుంటే మాకు సమస్య ఏమిటి?
(సంవాదలేఖ-7)

"ఏం పని మీద వచ్చావు? నాకు చెప్పు."
"లేదు. నేను మీతో మాట్లాడటానికి రాలేదు. నేను ఆయననే నేరుగా కలవాలి."
"వారు నేరుగా ఎవరినీ కలవరు. నా ద్వారా మాత్రమే పలుకుతారు."
"ఎందుకు మాట్లాడరు? ఎందుకు కలవరు? ఎందుకు పలకరు..? నాకు చాలా సమస్యలు ఉన్నాయి. పలకకపోతే ఎట్లా చెప్పుకోవాలి?"
"నా ద్వారా.. ఇక్కడ ఇదే పద్ధతి.."
"నాకు నచ్చలేదు. నేను ఒప్పుకోను. నాతో ఎందుకు నేరుగా మాట్లాడరో నేనూ చూస్తా.."
"ఆయన ఎవరితోనూ మాట్లాడరు.. ఎందుకంటే ఎవరూ ఆయనతో మాట్లాడలేరు."
"మరి మీరు ఎట్లా మాట్లాడతారు..?"
"హహహ అలవాటు కనక.. నీ సమస్య నాకు చెప్పు."
"నేను నా సమస్య ఆయనతోనే చెప్తాను."
"నువ్వు చెప్పలేవు."
"ఎందుకు చెప్పలేను? తప్పకుండా చెప్తాను."
"ఆయనను చూశాక నీకు సమస్యలు గుర్తు రావు.."
"అందుకే వ్రాసుకుని వచ్చాను."
"వ్రాసుకున్నది చదవడం కూడా మర్చిపోతావు.. ఇదివరకటి వారి అనుభవం నాకు తెలుసు."
"ఆయన మాయలేవీ నామీద పనిచేయవు. అదంతా నేను చూసుకుంటాను కదా. నన్ను లోపలకు పోనీయండి."
నవ్వుతూ- "సరే వెళ్ళు."
(ద్వారం తెరిచాడు నంది)
(లోపలకు వెళ్తూనే పరమేశ్వరుడు ధ్యానమూర్తి దర్శనమిచ్చాడు. నేను ఆయనను చూసిన పరవశంలో  సర్వం మరిచిపోయాను. లోపలికి వచ్చే ముందు ఏమి అనుకున్నాను ఒక్కటి గుర్తు లేదు. కాగితం చూస్తే ఏమీ కనిపించలేదు. అక్షరాలు పోల్చుకోలేకపోయాను. కంటినిండా ఆనందాశ్రువులు.. కంఠం గద్గదం.. శరీరం రోమాంచితం.. చేష్టలు స్తంభించాయి.. చూపులు దివ్యమనోహర మూర్తిపై నిలిచిపోయాయి.. ఆయన తప్ప ఏమి కనిపించలేదు.
అంతలోకే ఆయన కళ్ళు తెరిచి అడిగాడు.)
"చెప్పు.. ఏం పని మీద వచ్చావు?"
"ఏమీ లేదు తండ్రి.. ఇంత దయతోటి మమ్మల్ని కాపాడుతున్నారు.. మీకు ధన్యవాదాలు చెబుదామని వచ్చాను ‌.."
"ఏమైనా సమస్యలు ఉన్నాయా?"
"ఏమీ లేవు స్వామి.. ఎంత చల్లని దైవానివి మీరుండగా మాకేం సమస్యలు ఉంటాయి..?"
పరమేశ్వరుడు నవ్వేడు "తథాస్తు" అంటూ. ఆ క్షణమే నా సమస్యలన్నీ తీరిపోయాయి అని నాకు అర్థం అయింది. హృదయపూర్వకంగా తండ్రికి ప్రణామాలు చేసి వెనక్కి మరలాను. ఆయన నా వెంబడే నాతో ఉండిపోయిన భావం..

సంకా ఉషారాణి
04.11.2018

No comments:

Post a Comment