Sunday, 12 August 2018

సంవాదలేఖ-6 - మీరే ఏదో చేశారు -- ఒక సంవాదం

మీరే ఏదో చేశారు -- ఒక సంవాదం 

“చూద్దాము, మీ భక్తులు ఏం చేస్తున్నారో.. అరే! ఇతడికి ఏమైంది? ఎందుకు ఇట్ల నాట్యం చేస్తున్నాడు?”
“నాకేం తెలుసు ఎందుకు నాట్యం చేస్తున్నాడో! వెళ్లి నువ్వే అడుగు.”
“ఇతడు అడిగే స్థితిలో వుంటే కదా! ముందు ఈ వేళలో చాలా భక్తిగా పూజ చేసుకునేవాడే! ఇవాళ పూజ లేదు ఏమీ లేదు! నాట్యం చేస్తునే ఉన్నాడు.. నవ్వుతునే ఉన్నాడు..! ఏమైపోయింది ఇతడికి?”
“నాకేం తెలుసు ఏమైందో!”
“లేదు లేదు.. మీరే ఏదో చేసినట్టున్నారు!”
“నేనా!? నేనేం చేయగలను? నీ మాట విన్నాను. అంతే.”
“ఏమి మాటండీ బాబూ”
“నువ్వు అన్నావు కదా అని అతడి భక్తికి సంతుష్టిచెంది వెళ్ళి దర్శనం ఇచ్చి వచ్చాను. అంతే! అప్పటి నుంచి ఎగురుతున్నాడు..! ఇందులో నా తప్పు ఏముంది?”
“ఓహో! ఇప్పుడు అర్థమైంది. మీ దర్శనం వల్ల ఆనందం ఉత్సాహం పొంది, అతడికి మత్తు ఎక్కింది. మంచి పని చేశారు. మీరు కూడా భలేవారు! జనాలను రెండు విధాల పిచ్చివాళ్ళను చేస్తారు. ఎవరికైతే మీరు కనిపిస్తారో వారు ఆనందంతో పిచ్చి పట్టి పోతారు. ఎవరికి మీరు కనిపించారో అతడు దుఖంతో పిచ్చివాడైపోతాడు!
--ఏ భక్తుడి గురించి పార్వతీ పరమేశ్వరులు ఈ విధంగా మాట్లాడుకుంటారో అతడి జీవితం ధన్యం కదా! కాదా?

--------------------------------- 

किमिदं कृतं भवता!! -कश्चन संवादः

“इतः पश्यामि, भवतः भक्ताः किं कुर्वन्तीति। अहो! किमभवत्? कुतः नृत्यत्येषः?”
“कथं जानेऽहं, कुतो नृत्यतीति? स्वयमेव पृच्छ।”
“प्रष्टुमनुकूला स्थितिः क्वास्ति! पूर्वं तु अस्म्यां वेलायां महत्या भक्त्या अयं जनः अनुष्ठानमाचरति स्म! अद्य किमपि नास्ति, केवलं नाट्यं करोति! हसति! किमभवदस्य?”
“कथं ज्ञायेत? न हि जानाम्यहम्!”
“नैव, अवश्यं भवता एव किमपि कृतम्।”
“मया? किमहं कर्तुं प्रभवामि? अहं तु तव वचांसि श्रुत्वा तथैवाचरितवान्।”
“कानि वचांसि?”
“त्वयेवोक्तं किल, तथैव तस्मै सन्तुष्टः सन् दर्शनं प्राददम्! तावदेव, तदारभ्य उन्मत्त इव नृत्यन्नास्ते! अस्मिन् मम को वा दोषः?”
“अहो, अवगच्छाम्यधुना! भवद्दर्शनेन आनन्दितः प्रफुल्लितश्च सन् अस्य मत्तभावः आवृतः। साधु आचरितं भवता। भवानपि जनान् उभयथा उन्मत्तान् कारयति- यः भवन्तं पश्यति, स आनन्देन उन्मत्तो जायते, येन भवान् न दृष्टः, सः दुःखेन उन्मत्तो भवति!”
--यस्य भक्तस्य विषये पार्वतीपरमेश्वरौ एवं सँल्लपेतां, तस्य जीवनं धन्यं खलु!

---------------------------------
यह आप ने क्या किया?! --एक संवाद

“देखती हूं, आप के भक्त क्या कर रहे हैं। अरे! इसे क्या हो गया? यह क्यों नाच रहा है?”
“मुझे क्या पता क्यों नाच रहा है? खुद ही पूछो।”
“यह पूछने लायक स्थिति में हो तब न! पहले तो इस समय पर बड़ी भक्ति से पूजा पाठ करता रहता था! आज ना पूजा ना पाठ, नाचे जा रहा है! हँसे जा रहा है। क्या हो गया इसे?”
“मैं क्या जानूँ? पता नहीं क्या हुआ!”
“नहीं, अवश्य आपने ही कुछ किया होगा।”
“मैं? मैं क्या कर सकता हूं? मैं ने तो बस, तुम्हारी बात मानी है।”
“कौन सी बात जी?”
“तुम्हारे कहने पर मैं केवल उससे संतुष्ट होकर दर्शन दे आया हूं! बस, तब से उन्मत्त की तरह नाचे जा रहा है! इसमें मेरा क्या दोष है?”
“ओह, अब समझी! आपके दर्शन से आनंदित प्रफुल्लित हो नशा हो गया इसे। अच्छा किया आपने। आप भी ना, लोगों को दोनों ओर से पागल कर देते हैं! जिसे आप दिखे, वह आनन्द से पागल हो जाए, जिसे आप नहीं दिखे वह भी दुख से पागल!”
--जिस भक्त के बारे में मां पार्वती और शिव जी इस प्रकार संलाप करें, उसका जीवन धन्य है, है न?!

---------------------------------

శివగీతం-3 - మా ఇంటికి రావయ్యా (షోడశోపచారాల చిరు గీతాష్టకం)

ఏమయ్యా, మా ఇంటికి రావు, ఎంతని పిలిచేది
అహా, ఇప్పటికొచ్చావే, నాదెంతటి సౌభాగ్యం
అయ్యో, అట్లా నిలబడ్డావేఁ, లోపల రావయ్యా
ఆసనం అది మెత్తగ లేదు, ఇక్కడ రా, కూర్చో

నీ చేతులు, పాదాలందించు, శుభ్రం చేస్తాను
ఇదిగో అందుము మంచినీరు, నీ దాహం తీరిందా?
గోరువెచ్చని నీరు పోసుకుని స్నానం కానించు
తడి ఆరేంతగ తుడిచాకే, ఈ బట్టలు ధరించు

ఇదిగో, నీరు, అందుకుని నీ గొంతు కాస్త తడుపు
నీకై తెచ్చా యజ్ఞోపవీతం, దీనిని ధరించు
చలవ చేసేటి ఈ గంధాన్ని మేనికి పూయనీ
ఏదీ, నీ నుదురిటు చూపించు, కుంకుమను దిద్దనీ

ఇదిగో పరిమళ పుష్పం, అది నీ అందం ముందెంత?
పూమాలలు నీ మెడలో వెయనీ, భూషణాలివ్వనీ
అగరొత్తులు ధూపాల సువాసన నీకు నచ్చిందా?
వెలుగులనిచ్చే నీకై దీపం వెలిగించా చూడు

ఇదిగో రుచికరమైన భోజనం, తిని ఆనందించు
చక్కని ఆకూ, ఒక్కలతో నీకిదిగో తాంబూలం
ఘంటానాదం సహితంగా నీకిదిగో హారతులు
మంత్రాన్నే ఓ పుష్పం చేసి నీకై అర్పిచా

నీ పాదాలకు అక్షతలేసి ఇదె అంగప్రణామం
కాస్తాగు, ఇక సేద తీరు, చామరం వీయనీ
నీకై చక్కని పాట పాడుతూ కీర్తించుకోనా
ఈ నృత్యంతో నీ మనసును ఆనందపరచనా

నీ తత్త్వం నే తెలియగలేను, జ్ఞానిని నే కాను
నిను భావించి, శక్తిని బట్టి నిను పూజించేను
ఎల్లప్పుడు నీ కరుణను చూపి కాపాడు ఓ స్వామీ
ఆత్మప్రదక్షిణ చేస్తూ నీకై సర్వం అర్పించా

అయ్యో అపుడే వెళిపోవాలా, మళ్ళెపుడో రాక?
నావల్లేదైనా తప్పైతే క్షమించు ఓ తండ్రీ
దాసుని తప్పులు దండంతో సరి, ఇదిగో నమస్సు
నీ రాకతో మా ఇల్లు పావనం, వెళ్ళిరా నా తండ్రీ


(సరళంగా పాడుకుంటూ భావించుకోగలిగే విధంగా ఉపచారాల పాట.. అపచారమేదైనా ఉంటే సూచించండి.. ఏమో- ఈరోజు అట్లా అనిపించింది.. రత్నైః కల్పితమాసనం- వింటుంటే.. అంత గొప్పగా సింహాసనాదులు భావించటం నాకు రాదు.. (భావదరిద్రం ఆయన కరుణతో తీర్చినప్పుడు తీరుతుంది) అప్పటిదాకా నా పరిధిలో నా ఊహలో అందినంత..)

సంవాదలేఖ-5 - హాలాహాలపాన సందర్భం

పార్వతి-- ఏమయ్యా, ఏంటా పని?
శివుడు-- అయ్యో లోక రక్షణ.. అలవాటైన పనే!
పార్వతి-- ఇంకా నయం.. అది కాఫీ అనుకున్నారా, వేడిగా ఉందని నోట్లో ఓ పోసేసుకుంటున్నారు?
శివుడు-- లేదు, విషమే.. తెలుసు, వాసన చూశాను. అబ్బా.. ఘాటు..!
పార్వతి-- మరి ఇంకా పక్కకు పారెయ్యవేమయ్యా నాథా!
శివుడు-- అందరూ చచ్చిపోతున్నారు చూడు.. కనికరించు.. పైగా దేవతలు మొదటి ఉపహారమని నాకే సమర్పించారు..
పార్వతి-- ఆఁ.. ఆఁ.. ఇస్తారు.. వాళ్ళ సొమ్మేం పోయింది..!!
శివుడు-- ఇంతకూ ఏం చేయమన్నావు చెప్పు..! ఎక్కువ సమయం లేదు..!
పార్వతి-- (మంగళసూత్రాలు కళ్ళకు అద్దుకుని) ఇప్పుడు తాగండి.. నాకు మాత్రం జీవకారుణ్యం లేదేంటి..
శివుడు-- అయ్యో.. మాతృమూర్తివి.. నీకెందుకు ఉండదు?? ఇంతకు- ముందెందుకు వద్దన్నావు, ఇప్పుడెందుకు తాగమంటున్నావు?
పార్వతి-- నా అనుజ్ఞ లేకుండా అది తాగి ఒంటిమీదకు తెచ్చుకుందామనే..!! వీలుంటుందా..? ఇంతకూ మొత్తం తాగెయ్యకండి
శివుడు-- లేదులే.. గొంతులో ఆపేసి దాచేస్తా..
పార్వతి-- అది ఏమైనా జాడీయా, విషాలు పోసి దాచుకోవటానికి?
శివుడు-- కాదు.. నిన్ను చూస్తూ తాగితే విషం కూడా అమృతమే కదా.. అది అక్కడ నాకు ఆభూషణమై నిలుస్తుంది.. అందరూ నీ మాంగల్య బలాన్నే కొనియాడతారు.. (తాగేస్తాడు)
పార్వతి-- మీకిదో సరదా.. ఉన్నపేర్లు చాలవన్నట్టు- ఇప్పుడు నీలకంఠుడు అయ్యారు..
శివుడు-- నీ రూపమైన జగత్తు నిలవాలంటే ఈ మాత్రం తప్పదు..
పార్వతి-- మంటగా ఏం లేదు కదా
శివుడు-- లేదు.. చెప్పాగా.. నిన్ను చూస్తూ..
పార్వతి-- ఆఁ.. ఆఁ.. చాలు లేండి.. మీ సరసం..


-సంకా ఉషారాణి
-----------------------

🙏 जब विष पीने लगे महादेवजी 🌼
(संवादभावलेख)
💝
पार्वतीजी— क्यों जी, कैसा कार्य है यह?
शिवजी— अरे, यही, लोकरक्षण.. जिसके अभ्यस्त हैं, वही कार्य!
पार्वतीजी— अच्छा जी, क्या उसे चाय समझरखी है, कि गरम गरम है, सोचकर मुख में डालने जा रहे हैं!!?
शिवजी— नहीं नहीं, विष ही है.. जानते हैं, सूंघली है.. उफ़... तीखा है..!
पार्वतीजी— तो फिर भी क्यों उसे बगल में फेंक नहीं रहे हैं नाथ!
शिवजी— सब जीव मर रहे हैं, देखो न.. थोडी तो दया करो.. देवताओं ने पहली भेंट बनाकर मुझ ही को इसे उपहार में समर्पण किया है..
पार्वतीजी— हाँ.. हाँ.. क्यों न दें!.. उनका क्या बिगड़ता  है?!!
शिवजी— अन्ततः क्या करना है मुझे? वह बोलो! अधिक समय नहीं है..!
पार्वतीजी— (मंगलसूत्रों को बड़ी श्रद्धा से आँखों पर लगाती हुई) अब पीजिए.. क्या मुझमें जीवकारुण्यभाव नहीं है क्या?..
शिवजी-- अरेरे.. तुम तो मातृमूर्ति हो.. तुममें क्यों नहीं होगा?? अच्छा यब बताओ पहले काहे मना किया, अभी काहे पीने को कह रही हो?
पार्वतीजी— मेरी अनुज्ञा रके बिना उसे पीकर आपत् लेआना है क्या.!! क्या ऐसा होने दूंगी मैं..?! हाँ एक और बात, सारा का सारा मत गटक जाइएगा..
शिवजी-- नहीं.. बस, गले में रोककर छिपादूंगा..
पार्वतीजी— क्या वह कोई शीशी है, जिसमें विष डालकर छिपाना चाहते हैं?
शिवजी— नहीं.. पर तुम्हे निहारते हुए पीलें तो विष भी अमृत ही है न.. वह वहाँ मेरा आभूषण बनकर रहेगा.. सब तुम्हारे मांगल्य बल का ही प्रशंसा करेंगे.. (पीलेते हैं)
पार्वतीजी— यह सब आपका विनोद मात्र है.. जितने नाम लगे हैं, वे पर्याप्त नहीं- अब यह नीलकंठ बनना  आवश्यक था..
शिवजी— तुममय (तुम्हारे रूप वाला) जगत् बचना है, तो इतना तो करना पड़ेगा..
पार्वतीजी— अच्छा, कोई जलन तो नहीं है न..
शिवजी— नहीं नहीं.. कह दिया न.. तुम्हे निहारते पी लूँ तो..
पार्वतीजी— हाँ.. हाँ.. बस छोड़िये.. आप और आप का यह हास्य..
💞

--उषाराणी सङ्का

సంవాదలేఖ-4 - శివః శక్త్యా యుక్తః

శివుడు-  ఏంటి? ఈరోజు అంత ముభావంగా ఉన్నావు?
పార్వతి- మీకెందుకు నేనెట్లా ఉంటే?
శివుడు- అయ్యో, చెప్పు, ఏమైనా తీర్చేదుంటే తీరుస్తాను.
పార్వతి- ఆఁ, వివాహం అయిన దగ్గరినుంచీ చెప్పుకుంటునే ఉన్నాను.. అప్పుడు తీర్చారు గనుక..!
శివుడు- (నవ్వి) ఏ విషయమో సరిగ్గా చెప్పు.. మూడు కళ్ళు ఉన్నా నీ మనసు నాకు గోచరం కావటం లేదు.
పార్వతి- అదేం కాదు.. నా నోట చెప్పించాలని! మీ నింద చేయటం నాకు పాపం. పోండి, నేనేం చెప్పను.
శివుడు- ఏది, నా రూపం, క్రియల గురించేనా? ఆ మధ్య నీ మిత్రురాలు మహాలక్ష్మి ఏదో అన్నదని కుంగుకున్నావు-  అదేనా?
పార్వతి-  అదే అదే! తనకు తగినట్టు నేను ఆవేళే సమాధానం చెప్పేశాను. (కోపంగా) కానీ అన్నదానిలో తప్పేముంది?
శివుడు- అందరూ అన్నది వింటావు.. నేనెవరో నీకు తెలియదా?
పార్వతి- తెలుసు కనుకే అడుగుతున్నాను. అసలేంటి? ఎట్లా బ్రతకాలి మీ పంచన? ఆ ఒళ్ళంతా బూడిద, తోలు బట్టలు, వెంట ముసలి ఎద్దు, ఈ శ్మశానంలో ఉండటం, చేతిలో భిక్షాపాత్ర, దానితో భిక్షమెత్తి బ్రతకటం, పాములు చుట్టుకుని తిరగటం, నెత్తిన ఇంతెత్తు కొప్పులు, ఎన్నడూ కనీసం దువ్వరు, వాటిలో పగలూ రాత్రీ జలాల హోరు.. ఒకటా రెండా..? ఎన్నని చెప్పను? చెప్పినా మీరు మారతారా?
శివుడు- (గట్టిగా నవ్వి) అయ్యో, పిచ్చి గౌరీ, నేను ఎంత సుందరుణ్ణో నీకు తెలుసు కదా. నన్ను పెళ్ళికి ముందు చూసి, కోరి, మోహించి, పరితపించి, కఠిన తపస్సు చేత కొనేసుకుని పొందింది నువ్వే కదా..! అప్పుడు లేని ఈ బాధ ఇప్పుడెందుకు?
పార్వతి- (తలవంచుకుని) అట్లా కాదండీ.. తన భర్త అందంగా ఉంటే చూడాలని భార్యకు అప్పుడప్పుడైనా అనిపించదా? అటు దేవతలూ, ఇటు మనుష్యులు నా పక్కన మిమ్మల్ని చూసి ‘ఇంత అందమైన అమ్మాయికి ఎట్లాంటివాడు దొరికాడు? ఇతడి కోసమా, ఈమె అంత తపస్సు చేసింది? ఏం చూసి ఇచ్చారు ఈమె తల్లిదండ్రులు ఆయనకు?’ అని అనుకుంటున్నారు.
శివుడు- ఔనా? నేనెప్పుడూ వినలేదే.. నా ముందు ఎవ్వరూ అనలేదే!
పార్వతి- అంత ధైర్యమా వాళ్ళకు? మీతో పని ఉన్నవారు మీగురించి మీముందే మాట్లాడేయరు కదా. ఒకవేళ వారు అన్నా మీకు ఆ ధ్యానలయలో పట్టించుకునే తీరిక ఏది?
శివుడు-  (నిట్టూర్చి, ఆమె తల ఎత్తి) సరే-  అయితే చూడు.. (తన అసలు రూపంలోకి మార్చుకుని) ఇప్పుడేమంటావు?
పార్వతి- (నమ్మలేనట్టు కళ్ళనిండా పైనుండి కిందిదాకా చూసుకుని ఏదో అనబోయి ఇంతలోకే మూతి ముడుస్తుంది.)
శివుడు- ఏమైంది? కళ్ళలో ఒక్క వెలుగు కనిపించి మళ్ళీ ఇంతలోనే కారుమబ్బు కమ్మింది?
పార్వతి- మీతో నేనేం మాట్లాడను పోండి.
శివుడు- అయ్యో, ఎందుకు? ఇప్పుడేం పాపం చేశాను? ఈ అందం సరిపోలేదా? ఈ సహస్రకోటి కందర్పకాంతి, దివ్యాభరణాలు, దివ్యమాల్యాలు, సుగంధ లేపనాలు, మహార్హమైన వస్త్రాలు, ఈ హిమాలయాలనే శోభింపచేసే సౌందర్యం-  ఇవన్నీ కూడా చాలలేదా?
పార్వతి- (కొద్దిగా నవ్వుతుంది తల అడ్డంగా ఊపుతూ)
శివుడు- (ఆలోచించి నవ్వి) లేక... నీకన్నా అందంగా అయిపోయాననా? నిజం చెప్పు.
పార్వతి- (ఎటో చూస్తుంది) మీ స్వరూపమే అంత అందం కదా! దానికి మీరేం చేస్తారు? నాకు నిజంగా ఈర్ష్యగా ఉంది.
శివుడు- (నవ్వి) అర్థమైంది. అయ్యో, శివా! ఒక్కసారి ఇటు చూడు..
పార్వతి- అఁహఁ.. నేనేం వినను.. చూడను.. (వెళిపోబోతుంది)
శివుడు- (ఆమె చేతిని పట్టి ఆపి) ఆగు. ఒక్కమాట తర్కం ఆలోచించు. ఇది నా అందమా? నన్ను వ్యక్తం చేసింది ఎవరు? నువ్వు లేకపోతే నేను వ్యక్తమవుతానా? నాకు ఆ సామర్థ్యం ఉందా? నన్ను వ్యక్తం చేసే శక్తివి నీవైతే ఈ సౌందర్యం నీవే కదా.
పార్వతి- (కొంచెం సిగ్గుగా నవ్వి) నిజమేననుకోండి. కానీ ఇంత మోహనంగా మిమ్మల్ని చూసి.. చాలా ఆనందంగా ఉంటే తట్టుకోలేక కోపం నటించాను. (ముఖం అరచేతుల్లో దాచేసుకుంటుంది).
శివుడు- (నవ్వేసి ఆమె చేతులు తీసేసి) సరే.. మరి, ఇప్పుడు నీ భర్త పై ఏమైనా ఆక్షేపాలు మిగిలున్నాయా?
పార్వతి- (చిరునవ్వుతో చూస్తూ) ఇంకేం ఉంటాయి? ఇంక మీకెట్లా వీలుగా ఉంటే అట్లా ఉండండి. నాకే ఆక్షేపాలూ లేవు. మీ నిజమైన సౌందర్యం పదునాల్గు లోకాలలోని ఆక్షేపకులకు చూపాలనే ఆత్రుతలో అట్లా మాట్లాడాను. క్షమించండి.
శివుడు- మనలో మనకు క్షమలేంటి? ఫరవాలేదు. ఎటూ తయారైనాము కదా. అట్లా తిరిగి వద్దాము-  ఈ ముసలి ఎద్దు మీద.
పార్వతి- (నవ్వి) వస్తున్నా. మన నంది ఏం ముసలివాడు కాదు. ఏదో ఊరికే అన్నాను అట్లా.
శివుడు- నువ్వట్లా అన్నప్పుడు విని నంది నొచ్చుకున్నాడేమో.
పార్వతి- నేను లాలిస్తా లేండి. పదండి. మిమ్మల్ని ఇంత సుందరంగా చూసి ఎంత ఆనందిస్తాడో అతడు.
శివుడు- (నవ్వి) పిల్లలను కూడా తీసుకుపోదామా?
పార్వతి- వాళ్ళు అప్పటినుంచే సిద్ధంగా ఉన్నారు. పదండి.
[దేవతలంతా సంతోషంగా నవ్వుతూ వారిపై పుష్పవృష్టి కురిపించారు.]
(ఆ విధంగా సరససల్లాపాలు చేసుకుంటూ ఆనందించే ఆ సంతృప్త కుటుంబీకుడు మనలను సర్వదా రక్షించుగాక.)
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
 

{ఇందులో పూర్వ భాగం శివభక్తవిలాసంలో ఉంది. శివుడు తన రూపం మార్చినంతవరకు-  కానీ ఆ తరువాత పార్వతి ఈర్ష్యాది ఘట్టం నేనూహించినది. మూలంలో ఆమె ఆయన రూపంచేత పరవశయై స్తుతిస్తుంది. ఉపమన్యుమహర్షికి కృతజ్ఞతలతో.. శివార్పణం}


ఒక సవరణ. పార్వతీదేవికి ఈర్ష్య ఉంటుందా? నిజంగా భర్త సౌందర్యం చూసి ఆమె ఆనందించాలి కదా-  అని అనిపించింది. ఏమో మరి-  ఆ ఘట్టం చదివిన వేళ స్ఫురణ అకస్మాత్తుగా అట్లా వచ్చింది. ఆయన అందంగా రూపం మార్చుకున్నాక కూడా ఆమె కోపానికి కారణం ‘అంత అందం పెట్టుకుని కూడా రోజూ విరూపంగా ఉండటం ఎందుకు?’ అని మారుద్దామని కూడా ఎందుకో చేయలేకపోయాను. సరే, సరదాగా ఉంటుందని, ఈర్ష్య అయినా ఒక్క క్షణం పాటే కదా అని, అవతలివారు ఈర్ష్యపడేంత అందం ఒక గొప్పతనమే కదా అని, సరే, ఎన్ని అనుకున్నా ఇద్దరూ అభిన్నులే కదా అని, భర్త తనకన్నా అందంగా, గొప్పగా ఉంటే ఆయన పక్కనున్న ఆ భార్యకు గొప్పే కదా అని, సరిపెట్టుకున్నాను.

శివగీతం-2 - నదిలో లింగాల దృశ్యంతో కదిలిన మది

కలిలో వేడికి తాళగలేక
జలమున దాగేవా..
శిలపై శిలవై బహుళంగా అయి
ఇలపై నిలిచేవా..॥


అణువణువున దాగున్నది నీవని
ఈ విధి తెలిపేవా
వెలుపల లోపల అంతట నీవని
స్పృహ కలిగించేవా..॥


జలముల జలజల సామవేదమని
ఇట భావించేవా
ఆ సంగీతపు మంద్రస్థాయిన
వెలుపలకొచ్చేవా..॥
ప్రతి శిలపై నీ రూపం చూసి
కనులకు పండగలే
పాషాణాలే పాడిన రుద్రం
వీనుల విందేలే..॥


నదీధరునివే, నదిలో దాగిన
నీ పేరిపుడేమి..
నదీనివాసా, జలసహవాసా
ఏమని పిలిచేది..॥


నీటి దుప్పటిని కప్పుకుంటివా
ఇప్పుడు అది తొలగె..
కదిలే నీటిన కదలనిదది
స్థాణువుగా నీ వెలుగే..॥


పంటపొలాలకు నీరు పోసితే
పంటలు పండేను..
బండరాళ్ళపై నీరు పారగా
లింగాలు పండేను..॥
 

(శాల్మల నదిలో నీటిమట్టం తగ్గేసరికి లోపలున్న శివలింగాలు బయట పడినాయట.. ఆ వివరం ఇక్కడుంది--
https://www.sott.net/article/301190-Low-water-level-exposes-thousands-of-Shiva-Lingas-in-the-Shalmala-river)

భావలేఖ-2 - అమ్మను పట్టుకోవాలంటే ఎవరి తరం?

కైలాసంలో దాగుడుమూతలు ఆడదామని అనుకున్నారు. కుమారుడు తానే కళ్ళకు గంతలు కట్టుకుని మిగిలినవారిని పట్టుకుంటానన్నాడు.. కళ్ళకు గంతలు కట్టి వెతుకుతూ నవ్వుతూ తిరిగేసి త్వరగానే అన్నను, తండ్రిని పట్టేసుకున్నాడు.. కానీ అమ్మ మాత్రం అందలేదు. గంతలు విప్పి వెతికినా కనిపించలేదు. అమ్మ కనిపించలేదని ఏడ్చాడు. వినాయకుడు నవ్వుతూ తండ్రిని చూశాడు. అప్పుడు తనలో అర్ధభాగంగా మారి, బయటకు కనిపించకుండా దాక్కున అర్ధాంగిని పరమేశ్వరుడు ప్రకటం కమ్మని కోరాడు. ఆ తల్లి నవ్వుతూ వ్యక్తమై పిల్లవాడిని కన్నీరు తుడిచి లాలించింది.
అట్టి తల్లి మనలను అందరిని సర్వదా రక్షించుగాక.

భావలేఖ-1 - నేను పనికొస్తే వాడుకోవయ్యా..!

ఏమయ్యా ఉన్నావా, వింటున్నావా? ఓ మాట..! నీకు కూతుర్లు లేరు కదా. ఇద్దరూ కొడుకులే.. పాపం, ఇంటి పనికోసం ఇంట్లోవారిలా ఎవరుంటారు? గణాలుంటారులే.. కానీ ఎంతైనా ఇంట్లోవారిలా చేయరు కదా..! నన్ను నీ దగ్గర పెట్టుకోవచ్చు కదా! మీ ఇంట్లో అమ్మాయిలా పనులు చేసి పెడతాను. నీ ఎద్దును కడిగి పెడతాను.. నీ పాముల్ని రోజూ చక్కగా తుడిచి పెడతాను.. వాటికి ఆహారం పెడతాను.. నీ పిల్లలిద్దరినీ కూడా బాగా చూసుకుంటాను. పెద్దవాడి ఎలకను, చిన్నవాడి నెమలిని కూడా చక్కగా చూసుకుంటాను. వాళ్ళకు కావాల్సిన ఆహారం పెడతాను.
    ఇంక మీ ఆవిడకి ఇంట్లో వంటలో సహాయం చేస్తాను. ఆమె అన్నపూర్ణ కదా. అందరికీ వంట చేసిపెట్టడానికి చాలా పని ఉంటుంది.. ఒక్కర్తీ చేసుకోవాలి. అసలే నీకు ఐదు ముఖాలు, పెద్దవాడిది ఏనుగు ముఖం.. చిన్నవాడికి ఏకంగా ఆరారు ముఖాలు! పాపం.. అన్నిటికీ చూసి చూసి అన్నం తినిపించాలి కదా..! చాలా పని ఉంటుంది. చేతికంద ఉంటాను..
    ఇంకా నీ త్రిశూలం, పినాకం, నీ ఆయుధాలన్నీ, వాటితోపాటు మీ ఆవిడ ఎనిమిది చేతుల్లో ఉన్న అన్ని ఆయుధాలు, మీ పిల్లల ఆయుధాలు కూడా రోజూ తుడిచి పెడతాను. మీరేసుకునే ఆభరణాలు చక్కగా సాఫు చేసి ఇస్తాను. మీ పిల్లల పీతాంబరాలు, నీవు ధరించే జింక చర్మం, గజచర్మం ఉతికి పెడతాను. ఇంకా మీ ఆవిడ పట్టు చీరలు పాపం తనే పిండుకోవాలి కదా.. నేను పిండి పెడతాను. సరేనా?
    నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడు. తప్పక నేను మీ ఇంట్లో అందరికీ నచ్చుతాను. నీకు లోకరక్షణ, లోకపాలనా- బోలెడు పనులు ఉంటాయి. కనీసం జుట్టైనా దువ్వుకునే వేళ చిక్కదాయె. పనులు చేసి చేసి అలసటై, నీకు కాళ్ల నొప్పులు పుడితే ఎవరొత్తుతారు? పాపం – అమ్మవారు కూడా తన పనులతో అలసిపోతుంది కదా. ఇద్దరికీ పాదాలు ఒత్తుతాను. కనీసం ఎందులో అయినా నేను పనికొస్తే వాడుకోవయ్యా..!