Sunday, 12 August 2018

శివగీతం-2 - నదిలో లింగాల దృశ్యంతో కదిలిన మది

కలిలో వేడికి తాళగలేక
జలమున దాగేవా..
శిలపై శిలవై బహుళంగా అయి
ఇలపై నిలిచేవా..॥


అణువణువున దాగున్నది నీవని
ఈ విధి తెలిపేవా
వెలుపల లోపల అంతట నీవని
స్పృహ కలిగించేవా..॥


జలముల జలజల సామవేదమని
ఇట భావించేవా
ఆ సంగీతపు మంద్రస్థాయిన
వెలుపలకొచ్చేవా..॥
ప్రతి శిలపై నీ రూపం చూసి
కనులకు పండగలే
పాషాణాలే పాడిన రుద్రం
వీనుల విందేలే..॥


నదీధరునివే, నదిలో దాగిన
నీ పేరిపుడేమి..
నదీనివాసా, జలసహవాసా
ఏమని పిలిచేది..॥


నీటి దుప్పటిని కప్పుకుంటివా
ఇప్పుడు అది తొలగె..
కదిలే నీటిన కదలనిదది
స్థాణువుగా నీ వెలుగే..॥


పంటపొలాలకు నీరు పోసితే
పంటలు పండేను..
బండరాళ్ళపై నీరు పారగా
లింగాలు పండేను..॥
 

(శాల్మల నదిలో నీటిమట్టం తగ్గేసరికి లోపలున్న శివలింగాలు బయట పడినాయట.. ఆ వివరం ఇక్కడుంది--
https://www.sott.net/article/301190-Low-water-level-exposes-thousands-of-Shiva-Lingas-in-the-Shalmala-river)

భావలేఖ-2 - అమ్మను పట్టుకోవాలంటే ఎవరి తరం?

కైలాసంలో దాగుడుమూతలు ఆడదామని అనుకున్నారు. కుమారుడు తానే కళ్ళకు గంతలు కట్టుకుని మిగిలినవారిని పట్టుకుంటానన్నాడు.. కళ్ళకు గంతలు కట్టి వెతుకుతూ నవ్వుతూ తిరిగేసి త్వరగానే అన్నను, తండ్రిని పట్టేసుకున్నాడు.. కానీ అమ్మ మాత్రం అందలేదు. గంతలు విప్పి వెతికినా కనిపించలేదు. అమ్మ కనిపించలేదని ఏడ్చాడు. వినాయకుడు నవ్వుతూ తండ్రిని చూశాడు. అప్పుడు తనలో అర్ధభాగంగా మారి, బయటకు కనిపించకుండా దాక్కున అర్ధాంగిని పరమేశ్వరుడు ప్రకటం కమ్మని కోరాడు. ఆ తల్లి నవ్వుతూ వ్యక్తమై పిల్లవాడిని కన్నీరు తుడిచి లాలించింది.
అట్టి తల్లి మనలను అందరిని సర్వదా రక్షించుగాక.

భావలేఖ-1 - నేను పనికొస్తే వాడుకోవయ్యా..!

ఏమయ్యా ఉన్నావా, వింటున్నావా? ఓ మాట..! నీకు కూతుర్లు లేరు కదా. ఇద్దరూ కొడుకులే.. పాపం, ఇంటి పనికోసం ఇంట్లోవారిలా ఎవరుంటారు? గణాలుంటారులే.. కానీ ఎంతైనా ఇంట్లోవారిలా చేయరు కదా..! నన్ను నీ దగ్గర పెట్టుకోవచ్చు కదా! మీ ఇంట్లో అమ్మాయిలా పనులు చేసి పెడతాను. నీ ఎద్దును కడిగి పెడతాను.. నీ పాముల్ని రోజూ చక్కగా తుడిచి పెడతాను.. వాటికి ఆహారం పెడతాను.. నీ పిల్లలిద్దరినీ కూడా బాగా చూసుకుంటాను. పెద్దవాడి ఎలకను, చిన్నవాడి నెమలిని కూడా చక్కగా చూసుకుంటాను. వాళ్ళకు కావాల్సిన ఆహారం పెడతాను.
    ఇంక మీ ఆవిడకి ఇంట్లో వంటలో సహాయం చేస్తాను. ఆమె అన్నపూర్ణ కదా. అందరికీ వంట చేసిపెట్టడానికి చాలా పని ఉంటుంది.. ఒక్కర్తీ చేసుకోవాలి. అసలే నీకు ఐదు ముఖాలు, పెద్దవాడిది ఏనుగు ముఖం.. చిన్నవాడికి ఏకంగా ఆరారు ముఖాలు! పాపం.. అన్నిటికీ చూసి చూసి అన్నం తినిపించాలి కదా..! చాలా పని ఉంటుంది. చేతికంద ఉంటాను..
    ఇంకా నీ త్రిశూలం, పినాకం, నీ ఆయుధాలన్నీ, వాటితోపాటు మీ ఆవిడ ఎనిమిది చేతుల్లో ఉన్న అన్ని ఆయుధాలు, మీ పిల్లల ఆయుధాలు కూడా రోజూ తుడిచి పెడతాను. మీరేసుకునే ఆభరణాలు చక్కగా సాఫు చేసి ఇస్తాను. మీ పిల్లల పీతాంబరాలు, నీవు ధరించే జింక చర్మం, గజచర్మం ఉతికి పెడతాను. ఇంకా మీ ఆవిడ పట్టు చీరలు పాపం తనే పిండుకోవాలి కదా.. నేను పిండి పెడతాను. సరేనా?
    నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడు. తప్పక నేను మీ ఇంట్లో అందరికీ నచ్చుతాను. నీకు లోకరక్షణ, లోకపాలనా- బోలెడు పనులు ఉంటాయి. కనీసం జుట్టైనా దువ్వుకునే వేళ చిక్కదాయె. పనులు చేసి చేసి అలసటై, నీకు కాళ్ల నొప్పులు పుడితే ఎవరొత్తుతారు? పాపం – అమ్మవారు కూడా తన పనులతో అలసిపోతుంది కదా. ఇద్దరికీ పాదాలు ఒత్తుతాను. కనీసం ఎందులో అయినా నేను పనికొస్తే వాడుకోవయ్యా..!

సంవాదలేఖ-3 - నేను ఎదురుచూస్తున్నాను

నేను ఎదురుచూస్తున్నాను
సంవాదలేఖ-3
 

శివుడు- “ఏం కావాలి..?”
నేను- “ఏం వద్దు...”
శివుడు- “మరి, నా వంక అట్లా ఎందుకు చూస్తున్నావు..?”
నేను- “చూడాలనిపించింది.. చూస్తున్నా..”
శివుడు- “ఏమైనా కావాలంటే అడుగు. ఉత్తగ చూడటం ఎందుకు..?”
నేను- “అడిగింది ఎటూ ఇవ్వవు.. దాటేస్తావు.. కనీసం చూసైనా ఆనందించుకోనివ్వు..”
శివుడు- “ఏమివ్వలేదుటా..?”
నేను- “నీ నుంచి నిన్ను అడిగానుగా..! ఇచ్చావా ఇంతవరకు..?”
శివుడు- “అది కుదరదు.. చాలా కష్టం.. అందుకు ఎన్నో షరతులున్నాయి..”
నేను- “సరే, ఇవ్వకు.. నేనెప్పుడైనా మళ్ళీ అడిగానా..?”
శివుడు- “మరెందుకు చూస్తున్నావు..?”
నేను- “కనీసం కళ్ళ నిండా చూసుకోవటం కూడా తప్పేనా..!!?”
శివుడు- “చూడటానికి చాలా ఉన్నాయి..”
నేను- “నువ్వూ వాటిలో ఒకటి కదా..! నాకు నువ్వు చాలు”
శివుడు- “అదిగో, అటు చూడు.. ఎంత అందమైన ప్రకృతో..”
నేను- “చూడను..”
శివుడు- “ఇదిగో, నీకిష్టమైన పువ్వులు.. ఎంత సువాసనగా ఉన్నాయో.. వాసనైనా చూడు..!”
నేను- “అక్ఖర్లేదు..”
శివుడు- “ఏయ్.. నీకిష్టమైన ఆహారపదార్థం.. రుచైనా చూడు.. నోరు తెరువు..”
నేను- “వద్దు.. తెరవను..”
శివుడు- “సాక్షాత్తు అన్నపూర్ణే చేసింది.. నేను పెట్టినా తినవా?”
నేను- “మళ్ళీ ఆ ఆస్వాదనలో పడి నిన్ను పక్కకు పెట్టాలనా? అదేం చెల్లదు..”
శివుడు- “పోనీ, ఆ అమ్మాయి చూడు, ఎంత అందంగా నర్తిస్తున్నదో..”
నేను- “నీ తాండవం కంటేనా?
శివుడు- “నువ్వెప్పుడు చూశావది?”
నేను- “చూడలేదు, విన్నాను.. చదివాను.. చూసేంత అదృష్టమా?”
శివుడు- “పోనీ, ఇప్పటికి ఆమె నర్తనంతో తృప్తి పడు.. కనీసం చూడు.. ఓసారి”
నేను- “అంత బాగుంటే నువ్వే చూసుకో.. నాకు నువ్వు చాలు..”
శివుడు- “ఏంటీ పట్టుదల..?”
నేను- “అదంతే..”
శివుడు- “ఇంత అందమైన లోకం నీకోసమే చేసింది..”
నేను- “నేనవన్నీ చూస్తూ నిన్ను మర్చిపోవాలనే కదా నీ ఎత్తు..?! అదేం పారదు ఈసారి..”
శివుడు- “అయ్యో రామా..! ఇట్లాగే నన్ను చూస్తూ కూర్చుంటే ఏం వస్తుంది..?”
నేను- “ఏది రావాలో అదే వస్తుంది..”
శివుడు- “ఎన్నటికీ రాకపోతే..?”
నేను- “పోనీ..! ఏదో రావాలని చూడటం ఎప్పుడో మానేశాను..”
శివుడు- “నువ్వు కోరినది ఏదీ దొరకదు..”
నేను- “అందుకే ఏదీ కోరటం లేదు కదా.. ఎందుకంత కంగారు..?”
శివుడు- “ఇదిగో ఈ భక్తితో నా దుంప తెంపకు.. అడిగిందల్లా ఇవ్వటం నావల్ల కాదు..”
నేను- “ఇవ్వకయ్యా.. నీ దగ్గరే ఉంచుకో.. ఎవరడిగారు..?”
శివుడు- “ఇప్పుడు అడగవు.. తరువాత వదలవు”
నేను- “ఇప్పుడూ వదిలానని ఎవరు చెప్పారు?”
శివుడు- “అంటే? అడుగుతున్నావనేగా?”
నేను- “నేనేమీ నోరు తెరిచి అడగను.. చాలా? మాటిస్తున్నాను. కళ్ళార్పకుండా చూసుకోనివ్వు చాలు.”
శివుడు- “నువ్విట్లాగే చూస్తుంటే నువ్వడిగిందల్లా చేయాల్సి వస్తుంది..”
నేను- “అది నీ తలనెప్పి.. నాది కాదు.. మాటిచ్చింది నువ్వు.. నిలబెట్టుకోవలసిందీ నువ్వే..”
శివుడు- “సరే, పోనీ, ఆ అందమైన వీణాలాపనం అయినా విను..”
నేను- “చూడు, నీ పని నువ్వు చూసుకో. నేనేం చేయాలో నాకు వదిలేసేయి. మాచేత లోకంలో అవన్నీ చేయిస్తూ, భ్రమలో పడేస్తూ, మమ్మల్ని మరిపిస్తూ నువ్వు హాయిగా తప్పించుకుంటున్నావు.. ఇంక నీ ఆటలు సాగనివ్వను..”
శివుడు- “నావి ఆటలా?”
నేను- “మరి కాక? బొమ్మను చేసి..”
శివుడు- “ఇదిగో, బొమ్మల్లాగ మిమ్మల్ని ఆడించేది మీరు చేసుకున్న కర్మ..”
నేను- “సరే, ఏదైతే ఏఁ? నాకవన్నీ తెలియదు. నేనంత చదువుకోలేదు. ఏదేమైనా, ఇంక నేను ఆడను.. ఆడింది చాలు..”
శివుడు- “మంచి నిర్ణయం. ఇంక నాతో ఏం పని..?”
నేను- “ఆటైపోయాక చేరేది ఇంటికే కదా.. తలుపు తీస్తావని..”
శివుడు- “అదిగో, ఏమీ కోరనన్నావుగా..”
నేను- “నిన్ను తియ్యమనలేదే..! తీస్తావని నేను ఎదురుచూస్తున్నాను అన్నాను..”
శివుడు- “.....”
నేను- “అందరూ ఇదే అంటారు.. తరువాత నన్ను పీడిస్తారు.. అదివ్వు, ఇదివ్వు అని.. నేనివ్వలేను..”
శివుడు- ఆ మార్కండెయునికోసం యముడిని సైతం ఏ తప్పు లేకుండానే మట్టు పెట్టాను.. నాకు అవన్ని తిరిగి చేయాలని లేదు..
నేను- చేయకు..
------------

సంవాదలేఖ-2 - నిన్ను విడిసి ఉండలేనయా

నిన్ను విడిసి ఉండలేనయా
సంవాదలేఖ-2
 

నేను- “హరిఓం..”
శివుడు- “చెప్పు..”
నేను- “బాగున్నావా?”
శివుడు- “కనిపిస్తున్నా కదా”
నేను- “ఏం చేస్తున్నారు?”
శివుడు- “ఏముంటాయి? లోకనిర్మాణం, రక్షణం, సంహారం నాకు..; మీ అమ్మకేమో, భోజనం వేళ కదా.. వండి వడ్డించి ఆకళ్ళు తీర్చటంలో నిమగ్నత..”
నేను- “మరి పెద్దవాడు, చిన్ని కుమారుడు?”
శివుడు- “గజముఖంతో షణ్ముఖుడికి ఆటలు.. ఆరు ముఖాలతో గజాననుడికి ఆటలు..! పిండితో తయారైన పసివాడని చిన్నవాడు అల్లరి పెడతుంటాడు.. ఆరుగురు తల్లుల గారం ఇతగాడిని చెడగొట్టిందని పెద్దవాడంటాడు.. వాళ్ళ ఆటలు వాళ్ళవి.. నీకేం కావాలి?”
నేను- “ఏం వద్దు.. ఊరికే పలకరిద్దామని..”
శివుడు- “నిన్ను బయటే ఉంచానేమని మీ అమ్మ అడిగింది.. రమ్మంటోంది లోపలకు..”
నేను- “నువ్వు పిలిస్తే కానీ రానని చెప్పలేదా?”
శివుడు- “అదే చెప్పాను..”
నేను- “ఎందుకు పిలవటం లేదని అడిగిందా?”
శివుడు- “షరతులు అమలు అవుతాయని చెప్పాను..”
నేను- “ఔను.. అమ్మ కనుక బాధ అర్థం చేసుకుని రమ్మంటుంది.. షరతులు, నియమాలని ప్రాణాలు తోడదు.. తలుపు దగ్గర చూసి మొట్టమొదలు దగ్గర తీసుకుని, నదుట ముద్దు పెట్టి, కడుపు నిండా అన్నం పెట్టి, అప్పుడు బాధేంటని అడుగుతుంది.. చెప్పగానే తీరుస్తుంది..”
శివుడు- (సరదాగా) “ఆఁ..! ఆఁ..! ఏదైనా తేడా ఉందని తెలిస్తే రెండు అంటించేది కూడా అమ్మే..”
నేను- (నవ్వి) “ఔనౌను.. ఆ విషయంలో నాన్నలు నయం..! కోప్పడతారు, కానీ చేయెత్తరు.. ఆ స్వతంత్రం అమ్మకే..! కొడితే అమ్మ కొట్టాలి.. తిడితే అమ్మ తిట్టాలి.. నాన్నను మాట అననివ్వదు..! అందుకే తెలివిగా నీ దగ్గరకు వచ్చాను.. ”
శివుడు- “కబుర్లు బానే చెప్తున్నావు.. ఏం కావాలి?”
నేను- “ఎప్పుడైనా, ఎక్కడైనా నాకొకటే కావాలి..”
శివుడు- “కుదరదు..”
నేను- “వేయి సార్లు అదే చెప్పావు.. మళ్ళీ ఎందుకు అడుగుతావు..? నా బాధ నన్ను పడనివ్వరాదా?”
శివుడు- “ఇంకో కోటిసార్లైనా అదే చెప్తాను..! అయినా నీవు బాధపడుతుంటే చూడలేను..”
నేను- “అయితే తీర్చు..”
శివుడు- “షరతులు? నియమాలు? పద్ధతులు?”
నేను- “సరేలేవయ్యా.. వెళ్ళు.. పని చూసుకో.. లోకమంతా నీకోసం ఎదురు చూస్తున్నది.. నా పని నన్ను చేసుకోనివ్వు..”
శివుడు- “మరి పనివేళా పలకరించటం ఎందుకు?”
నేను- “లోపలకు పిలవటానికి కదా నియమాలు..?! పలకరించటానికి ఆటంకాలు లేవు కదా? ఏఁ.. అదీ తప్పేనా?”
శివుడు- “ఊఁ.. సరీపోయింది..”
నేను- “ఎక్కడా? నీవు కనికరించనిదే?”
శివుడు- “ఇవ్వను.. నీ మేలు కోరేవాణ్ణి కనకే..! అడిగిందల్లా ఇస్తుంటే పెద్దల విలువేం ఉంది?”
నేను- “సరే, నీ నిబంధనలు, పాఠాలు అయ్యాకే, నీ మార్గంలోనే వస్తాలే..”
శివుడు- “నీ ఇష్టం..”
నేను- “అది నా ఇష్టం కాదు.. నీ ఇష్టం..”
శివుడు- “రెండూ ఒకటే కాదా?”
నేను- “ఆ మాట నీవంటున్నావా?”
శివుడు- “నిజం అదే కదా! నేను నిజమే చెప్తా..”
నేను- (నవ్వు) “అందుకే నిన్ను విడిసి ఉండలేనయా.. నమో నమః..”

సంవాదలేఖ-1 - నువ్వే కావాలి

నువ్వే కావాలి
సంవాదలేఖ-1
 

శివుడు- “తీసుకో”
నేను- “వద్దు”
శివుడు- “ఇది వద్దా..?”
నేను- “ఏదీ వద్దు”
శివుడు- “మరి ఏం కావాలి?”
నేను- “చెప్పా కదా- ఏదీ అంటే ఏదీ వద్దని..”
శివుడు- “మరెందుకు పిలిచావు?”
నేను- “ఏదడిగినా ఇస్తావని పిలిచాను..”
శివుడు- “మరి ఇస్తానంటుంటే తీసుకోవేఁ?”
నేను- “ఇది కాదు నేను అడిగింది.. ఇది వద్దు..”
శివుడు- “మరి ఏం కావాలి?”
నేను- “ప్రశ్న తప్పు”
శివుడు- “సరే, సరైన ప్రశ్న నువ్వే చెప్పు..”
నేను- “ఎవరు కావాలి?”
శివుడు- “---” (చిరునవ్వులు)
నేను- “మరి కావాల్సింది.. ఇస్తావా..?”
శివుడు- “కుదరదు..”
నేను- “ఏదంటే అది ఇస్తానన్నావుగా..”
శివుడు- “ఎవరంటే వారిని అనలేదు కదా.. అడిగిన వస్తువు అన్నాను..”
నేను- “అడిగిన వస్తువు అంటే.. కావాలి అనే క్రియకు కర్మ.. అంతే కదా?”
శివుడు- “ఔను..”
నేను- “నా కావాలి క్రియకు కర్మకు నువ్వే..”
శివుడు- “ఇంకేదైనా అడగరాదా?”
నేను- “ఇంకేది అడిగినా ఇస్తావు.. అందుకే అడగటం లేదు..”
శివుడు- “కావాల్సింది దొరకటమే కదా, కావాలి కోరికకు అంతరార్థం..? ఇవ్వకపోవటానికి కాదు కదా ఇస్తానన్నది?”
నేను- “అందుకే.. ఇంక అదీ ఇదీ అడిగేకంటే అన్ని ఇచ్చే వాడివి నిన్నే పొందేస్తే ఓ పనైపోతుంది కదా అని..”
శివుడు- “తరువాత నా పనై పోతుంది..”
నేను- “అందుకే అడుగుతున్నా.. ఇంక నా పిచ్చి కోరికలన్నీ తీర్చే పని తప్పుతుంది కదా అని..! వేరొకరి సంగతి చూసుకోవచ్చు ఇక..”
శివుడు- “నీ సంగతి చూస్తూ వేరొకరి సంగతిచూడలేను అని ఎవరు చెప్పారు?”
నేను- “అబ్బా, వాదనలాపు.. ఇచ్చుకుంటావా ఇచ్చుకోవా చెప్పు..”
శివుడు- “నీవు ఆ స్థాయిలో లేవు..”
నేను- “నాకదంతా తెలియదు.. అడిగింది ఇస్తానని మాటిచ్చావు.. నిన్ను నువ్వు ఇవ్వు ఇక.. అంతే!! నేనింకో అక్షరం కూడా తక్కువ తీసుకోను.”
శివుడు- “సరే, ఎందుకు కావాలి నేను? ఏం చేసుకుంటావు?”
నేను- “అడిగినదానికి ఇంతవరకూ ఎవ్వరూ ఎందుకు అని అడగలేదు.. అయినా చెప్పాను కదా.. ఓ పనైపోతుంది అని.”
శివుడు- “ఇవ్వకపోతే ఏం చేస్తావు..?”
నేను- “మాట తప్పావని అందరితో చెప్తాను. .అప్పుడు నిన్నెవ్వరూ నమ్మరు..”
శివుడు- “అబ్బబ్బా.. బాగా అల్లరి నేర్చావు..”
నేను- “బూడిద పూసుకుని, పాములేసుకుని, మూడేసి కళ్ళతో, రక్తం ఓడే చర్మం కట్టుకుని, శ్మశానంలో ఒంటరిగా తిరిగే నీకంటేనా?”
శివుడు- “----” (చిరున్వవులు)
నేను- “తర్వాత నవ్వుదువులే.. మొదలు చెప్పు.. సమాధానం..”
శివుడు- “ఎవరు నేర్పారు నీకిది?”
నేను- “నాకన్నా ముందు నీ జాడ పట్టినవారే..”
శివుడు- “సరే, కానివ్వు..”
------------

శివగీతం-1 - శివ మహేశ్వర शिव महेश्वर

శివ మహేశ్వర శమ్భో పార్వతీపతే
భువననాయక శివ భూతికారక
నీలకన్ధర హర సున్దరేశ్వర
విశ్వమోహన ప్రభో పాహి శఙ్కర॥

శివరూపమ్–
ఫాలలోచన శమ్భో నాగభూషణ
భస్మలేపిత శివ జటాధారక
జాహ్నవీధర హర చన్ద్రశేఖర
నన్దివాహన ప్రభో నీలకన్ధర

శైవక్షేత్రాణి–
భీమశఙ్కర శమ్భో సోమసున్దర
కాశికాపతే శివ కాలభైరవ
మల్లికార్జున హర మఞ్జునాథ హే
త్ర్యమ్బకేశ్వర ప్రభో రామపూజిత

శివ మహేశ్వర శమ్భో పార్వతీపతే
భువననాయక శివ భూతికారక

శివకార్యాణి–
ఆదిభిక్షుక శమ్భో అన్ధకాన్తక
యమనియన్త్రక శివ ప్రలయకారక
నటనరఞ్జన హర నిత్యతపస్విన్
త్రిపురహారక ప్రభో కామనాశక

శివప్రియాః–
విష్ణువల్లభ శమ్భో ఇన్ద్రసన్నుత
హిమనగార్చిత శివ షణ్ముఖగురో
ధనపతిమిత్ర హర గజముఖార్చిత
భిల్లవత్సల ప్రభో హస్తితారక

శివ మహేశ్వర శమ్భో పార్వతీపతే
భువననాయక శివ భూతికారక

శివతత్త్వమ్–
ప్రాణస్వరూప శమ్భో ప్రణవవాచక
ఆశుతోషిత శివ అర్ధనారీశ
చిన్మయలిఙ్గ హర సామప్రియకర
వేదసారక ప్రభో విభవదాయక

శివ మహేశ్వర శమ్భో పార్వతీపతే
భువననాయక శివ భూతికారక
నీలకన్ధర హర సున్దరేశ్వర
విశ్వమోహన ప్రభో పాహి శఙ్కర॥
 

--------------------------


शिव महेश्वर शम्भो पार्वतीपते
भुवननायक शिव भूतिकारक
नीलकन्धर हर सुन्दरेश्वर
विश्वमोहन प्रभो पाहि शङ्कर॥

शिवरूपम्–
फाललोचन शम्भो नागभूषण
भस्मलेपित शिव जटाधारक
जाह्नवीधर हर चन्द्रशेखर
नन्दिवाहन प्रभो नीलकन्धर

शैवक्षेत्राणि–
भीमशङ्कर शम्भो सोमसुन्दर
काशिकापते शिव कालभैरव
मल्लिकार्जुन हर मञ्जुनाथ हे
त्र्यम्बकेश्वर प्रभो रामपूजित

शिव महेश्वर शम्भो पार्वतीपते
भुवननायक शिव भूतिकारक

शिवकार्याणि–
आदिभिक्षुक शम्भो अन्धकान्तक
यमनियन्त्रक शिव प्रलयकारक
नटनरञ्जन हर नित्यतपस्विन्
त्रिपुरहारक प्रभो कामनाशक

शिवप्रियाः–
विष्णुवल्लभ शम्भो इन्द्रसन्नुत
हिमनगार्चित शिव षण्मुखगुरो
धनपतिमित्र हर गजमुखार्चित
भिल्लवत्सल प्रभो हस्तितारक

शिव महेश्वर शम्भो पार्वतीपते
भुवननायक शिव भूतिकारक

शिवतत्त्वम्–
प्राणस्वरूप शम्भो प्रणववाचक
आशुतोषित शिव अर्धनारीश
चिन्मयलिङ्ग हर सामप्रियकर
वेदसारक प्रभो विभवदायक

शिव महेश्वर शम्भो पार्वतीपते
भुवननायक शिव भूतिकारक
नीलकन्धर हर सुन्दरेश्वर
विश्वमोहन प्रभो पाहि शङ्कर॥





("हरिवरासनं विश्वमोहनं" इति येसुदासेन गीतस्य अय्यप्पस्तोत्रस्य रागे शिवमुद्दिश्य कृतम्)
(హరివరాసనం విశ్వమోహనం- అని యేసుదాసు గానం చేసిన అయ్యప్పస్వామి స్తోత్రం రాగంలో శివుని గూర్చి కూర్చినది)